దేవి ఆరాధన

on


అమ్మవారి అర్చన
**************************************

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెదమమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

లంకలో వెలసిన శాంకరి దేవికి, తలంటి నీళ్లు పోసేదమమ్మా!
కాంచీపుర శ్రీ కామాక్షమ్మకు, కాంచన చేలము కట్టెదమామ్మా!

వంగ దేశపు శృంఖల దేవికి, కుంకుమ తిలకము దిద్దెదమమ్మా!
క్రౌంచ పురమున చాముండాంబాకు, పాపట సింధురముంచెదమమ్మా!

అలంపురీ జోగులాంబకు, పసుపు పారాణి పెట్టెదమమ్మా!
శ్రీ పర్వత భ్రమరాంబికకు, కాటుక కళ్ళకు దిద్దెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెదమమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

కొల్హాపురి మహాలక్ష్మిదేవికి, గజ్జెల గాజులు కూర్చెదమమ్మా!
మాహుర్యేక వీర మాతకు, బంగారు నగలు పెట్టెదమమ్మా!

ఉజ్జయినీ పురి కాళికాంబకు ,జాజులు జడలో తురిమెదమమ్మా!
పిఠాపురమ్మున పురుహూతికకు, మంచి గంధము పూసేదమమ్మా!

భౌజ పురమున గిరిజా దేవికి, కల్యాణార్చన చేసెదమమ్మా!
ద్రాక్షారామ మాణిక్యాంబకు, పరిమళ ధూపము వేసెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెద మమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !

హరిపురి శ్రీ కామ రూపిణికి, పాలు ఫలములు ఒసగేదమమ్మా!
ప్రయాగ మాధవేశ్వరికి, పాయస సమర్పణ చేసెద మమ్మా!

జ్వాలాముఖి శ్రీ వైష్ణవి దేవికి, దక్షిణ తాంబూల మిచ్చెద మామ్మా!
గయలో మంగళ గౌరీ దేవికి, జయ నీరాజన మిచ్చెద మమ్మా!

వారణాశి శ్రీ విశాలాక్షికి, వాహన సేవలు చేసెదమమ్మా!
కాశ్మీరంబున సరస్వతి మాతకు, నమ: శ్శతంబులు చేసెదమమ్మా!

అంబ రాజ రాజేశ్వరిని, భక్తిగా మదిలో తలచెద మమ్మా!
అష్టాదశ పీట సువాసినికి, అర్చన చేదము రారమ్మా !
***************************************


పద్దెనిమిది పీటాలలో వెలసిన పరమేశ్వరిని షోడశోప చార పూజ చేసేందుకు ఈ పాట కూర్చ బడింది. ఈ పాత పాట వ్రాసిన దేవరో తెలియదు కాని అందంగా వ్రాసారు. ఇది చదివి అమ్మకు మానసిక పూజ చేసుకోవచ్చు.కార్తిక మాసం పుణ్యమైన మాసం.భక్తి ప్రపత్తులకు అనువైన మాసం.ఈమాసమంతా ,మరీ పౌర్ణమిదాకా అన్ని ముఖ్య మైన తిథులే! సోమవారాలు అభిషేకాలు,క్షీరాబ్ధి ద్వాదశి , ఏకాదశి ,కార్తీక పౌర్ణమి అన్నీ ఇట్టే గడిచిపోతాయి. వన భోజనాలు పుణ్యము, పురుషార్దము అన్నట్లుగా ,అందరు కలిసి భోజనాలు చేయడం, సామూహికంగా పూజలు చేసుకోవడం నయనానంద కరంగా వుంటాయి. నీరెండలో కూర్చుని ఉత్తమ గ్రంధాలు చదవడం,ఇతరులకి వినిపించడం మనశ్శాంతిని కలిగిస్తుంది.భగవదారాధనకి సమయం నిర్ణయించ నక్కరలేదు. `మనం పడుకొని ప్రార్ధిస్తే ఆయన కూర్చుని విన్టాడట. హరి హరుల నిద్దరిని పూజించే కార్తీక మాసం పుణ్యాన్ని పంచి పెడుతుంది.

1 comments:

sailu said...

chala...andamga undi varnana....veelaite...ee paatanu paade vidhanam telupagalarani...aasistunnani

Post a Comment