అన్నిట నీవెరా!

on

  అన్నిట నీవెరా!
రచన -శ్రీ రావూరు వెంకట సత్యనారాయణ రావు


శ్రీ పతి నీవెరా!హృదయ
సీమల నేలేడు నేత వీవేరా!
పాపపు చీకటిన్ వెలుగు
బాటలు దిద్దేడు దివ్వె వీవేరా!
కోపమదేలరా!మనసు
కొద్దిని చేతుల నెత్తుచున్టిరా !
చూపిటు త్రిప్పరా!కరుణ
జూపర నాదొర వెంకటేశ్వరా!


వెన్నెల లేదురా,బ్రతుకు
వేసవి యెన్డర ,ఈ ఎడారి లో
తెన్నులు లేవురా,ఇసుక
తిన్నెలు లేచి తుఫాను వీచెరా,
మన్నును మిన్ను నేకమగు
మార్గమునందొక బాటసారిరా
కన్నుల నివ్వరా వెలుగు
గవ్వవు నీవేర వెంకటేశ్వరా !


దబ్బర లేలరా బ్రతుకు
దండను చేతురా నీకే వెతురా!
అబ్బుర మౌనురా బ్రతుకు
టన్చుల నీ వేలుగింత నిల్పరా!
మబ్బులు లేక నా హృదయ
మండలి నిల్వర చందమామ వై
దిబ్బెన వడ్డికాసునురా
దీవన లీయరా వెంకటేశ్వరా !


అండను చేరి నిల్తువని
ఆశలు చెందితి నేను ,నీవు ఆ
కొండల నెక్కి కుల్కెదవు ,
కొంచెపు వాడను ఎట్లు వత్తురా!
నిండిన వెల్గు వీవనచు
నిల్చితి నిక్కడ ,నాదు పున్నేముల్
పండిన పంటరా!ఎదను
పల్లకి చేతురా వెంకటేశ్వరా !


శ్రీకరమైన పాల్కడలి
శేషుడు మెత్తని పూల పాన్పుగా
నీకయి పవ్వలించు నట
నింగియు బంగారు రంగు ఛత్రమయి
నీకమనీయ రూపమున
నీడలు జిమ్ముచు నుండు నంట, ఆ
లోకన మాఎరా!వెలుగు
లోకము నీవేర వెంకటేశ్వరా!


నీకయి పొంగి పొంగి రమ
ణీయ తరంగము లొక్కటొక్కటే
తాకగ నాగరాజు మెయి
ద్రచ్చిన వెన్నయు ముద్ద ముద్దలై
ప్రాకెడు మంచు కొండవలె
రాజిలు రూపము దాల్చే నేమో ,నా
లోకము నీవెరా !ఎడద
లోతులు తవ్వర వెంకటేశ్వరా!


అసలది క్షీర సాగరము ,
అంబర మంతయు లేత వెన్నెలల్
అసద్రుశ భక్తీ దేవగణ
మంజలి పట్టుచు నీదు మూర్తిపై
విసరేడు వెల్ల నాకధుని
విచ్చినకల్వలు ,ఇంత వెల్లలొ
మసలేడు నీల వర్ణుడవు
మా మది నూగవ వెంకటేశ్వరా!


ఏలర సామి నన్ను గన
వేలరా!నీ కనుదోయి వెన్నెలల్
జాలులు జాలులై ప్రక్రుతి
జాచిన రెక్కల నీలి నీడలో
పూల పడన్తులేల్ల విర
బూసిన అంజలు లందుకొంచు నా
తూలిన గుండెలో వెలుగు
దొంతర పేర్చర వెంకటేశ్వరా !


కమలము నవ్వినన్ మురిసి
కౌగిట చేర్చును చందమామ ప
ద్మము కను గీటినన్ హృదయ
తంత్రులు మీటును భాస్కరుండు ,కూ
రిమి నిను గొల్చు భక్తులకు
రెక్కల నిత్తువు మింట వ్రాలగా
సమరతు లిట్టివే జగతి
సాగును తూగును వెంకటేశ్వరా!


నీలద నీలవర్ణ రమ
ణీయ మనోహర దివ్యరూప !వి
స్ఫార విలోచనా!హృదయ
వేణువు నూదగ తావదేలరా!
సారము లేని జీవితపు
సానువులన్ సుధ లొల్క జేయవా!
కూరిమి రాధనై కొలుచు
కొందుర నేనును వెంకటేశ్వరా!


అణువున మేరువన్దునను
అంబుజ నాభ త్వదీయ రూపమే
తొణికిస లాడు ,విశ్వ మది
తోరపు భక్తితో పుష్ప సంతతిన్
పుణుకుచు తెచ్చి పాదముల
పోయుచు పాడును భక్తీ గీతముల్
వణికెడు నాదు గుండెలవి
యొప్పున పూజకు వెంకటేశ్వరా!


అందిన దోయి లో వెలుగు ,
ఆత్మయే నీవను సత్య మెప్పుడో
అందినదోయి ,నా బ్రతుకు
నంకిత మెప్పుడో ఇచ్చితోయి ,నీ
సుందర రూపమున్ గనగ
చూపుల గుండెల గుచ్చుకొన్దు నే
కొందల మందుచుంటి కను
గోవలె నిన్నిట వెంకటేశ్వరా!


పూవులు చూచినను పుణుక
బోవదు హస్తము,రేకు రేకునన్
శ్రీవర నీదు రూపమది
చిత్రితమై కనుపించు ,కమ్మనౌ
తావుల లోన నీకరుణ
తారట లాడును కొమ్మకొమ్మకున్
పూవుల దేవళమ్ము
లయిపోఎర నీకయి వెంకటేశ్వరా!


శ్రీకరమైన నీ హృదయ
సింధువు నందొక బిందు రూపమై
నీ కమనీయ వేణురవ
నిస్వన మందొక సుస్వరంబునై
నీకయి మంగలారతుల
నేత్తెడు జ్యోతుల వెల్గుదారమై
పోక ఇదేలరా బ్రతుకు
బొంతర చింతర వెంకటేశ్వరా!


ఇడుముల బడ్డ నా బ్రతుకు
నించుక సానను చేసి యుంచితిన్
కదు వెరగొన్దు గుండెల సు
గంధపు చెక్కగా మార్చి యుంచితిన్
వడి వడి రాచి గంధమును
వన్నెల గిన్నెల కెత్తుచున్టి ,నీ
అడుగుల పూసికొందునురా
అందగా నీయరా వెంకటేశ్వరా!


మానవ జన్మ మిచ్చి ఇటు
మాయను త్రోసితి వేలరా ప్రభూ
జ్ఞానము చాలి చాలదుర
సాత్విక భావము నందలేనురా
ధ్యానము నిల్ప జాలనురా
తాపస వృత్తిని బూనలేనురా
మ్రానది మేలురా పువుల
మాలల నిచ్చుర వెంకటేశ్వరా!


జగమను చిత్ర రంగమున
జన్మల చావుల నిచ్చి పుచ్చుకో
తగిన విలాస లాలసల
దాగుడు మూతలు నీకు నచ్చేనా!
సగమయి పోతి నిన్విడిచి
చక్కని కృ ష్ణు ఢ వౌచు రమ్ము నీ
పగడపు కాలి గజ్జెనయి
పాడెద నాడెద వెంకటేశ్వరా!


స్వాగత మిత్తునో అమర
వందిత సుందర రూప నాకపున్
భోగము లేమి లేవిచట ,
పొంగిన మాఎద లొక్క టొక్కటే
దాగిన మూగ వీణలుగా
తత్తర నిత్తుము నీవు మీటినన్
రాగము లేమి జీవిత వి
రాగమే కల్గును వెంకటేశ్వరా!


లోక మనోహరా!ప్రణవ
లోల !శుభాంగ !పతంగ వాహనా !
ప్రాకట వైభవోన్నత వి
రాజిత పూజిత దివ్య తేజ ,అ
స్తోక కళా ప్రసన్న ,నయ
శోభిత ,ఎంతటి ప్రేమ కల్గే ,మా
వాకిటి ద్వారమున్ తెరిచి
వచ్చితి వల్లన వెంకటేశ్వరా!


ఇది యొక మాయ జన్మ జని
యించితి నావిధి యాజ్న రీతిగా
హృదయము వేదనా విధుల
హోరున వీచు తుపాను గాలిలో
పదిలము గాగ పట్టగల
బంగరు చేతి సరంగు నీవు ,నన్
వదలకు రా ప్రభూ!బ్రతుకు
వాకిట నిల్వర వెంకటేశ్వరా!


చెప్పరా స్వామీ!మేమెలమి
చేసేడు పూజలు నీకు నచ్చేనా!
చెప్పరా సామి!మామొరలు
చేరిన నీదగు వీను దోయికిన్
చెప్పరసామి!నాబ్రతుకు
చెంగలి వచ్చేనా పాద మంటగా !
తప్పదు స్వామీ మా కభయ
దానము సేయగా వెంకటేశ్వరా!


మనసున మల్లె పందిరులు
మాటలు తీయని తేనే జల్లులున్
కనుగవ నీకునై మురిసి
కాన్కగా నిచ్చెడు మంగ లారతుల్
తనవున వందనాక్రుతులు ,
ధ్యానమునన్ వెల లేని వెల్గులున్
పెనుగొను రీతి నీ వడుగు
పెట్టావా నాయెద వెంకటేశ్వరా


పొందుగ పూచు పువ్వులను
పున్నమి వెన్నెల లేత నవ్వులో
అందము చిందు డెన్దముల
ఆమనికోయిల తీపిగొంతులో
వందన ముద్రలో ,మధుర
వంశి నినాదములో,నుషస్సులో
సందేలో నీదు భావనలే
సాగును తూగును వెంకటేశ్వరా!


తెల తెల వార నీచరణ
తీర్ధము చేరెడు కౌతుకమ్ముతో
తెలితెలి రేకులన్ వరుస
తీరిచి దిద్దుచు విచ్చి నవ్వుచున్
వెలగల జన్మలై ప్రభుని
వెన్నెల పాదము చేరు పుష్పముల్
ఇల జనియించు నాడే ఫలి
ఇంచుర జన్మము వెంకటేశ్వరా!


రాగము త్రుంచి వేయరా ,వి
రాగము నా ఎద సాగ నీయరా!
భోగము లాపి వేయుమురా,
పొందుగా త్యాగము నాకు గూర్పరా!
తూగగా నీయరా బ్రతుకు
తుందిల మందుచు నీదు సన్నిధిన్
మ్రోగెడు ఘంట సేయుమురా
ముక్తి నోసంగర వెంకటేశ్వరా!


ఎందరు రాజులీజగతి
నేలిరో,ఎందరు బీద గుండియల్
చిందగా జీవితంములను
జిమ్మిరో కాలపు పెన్ ఎడారిలో !
అందరి నన్ని రీతులను
ఆలన చేయుచు సూత్ర ధారివై
యుందువు,నాదు పాత్ర ఎటు
లోప్పెనో చెప్పవా వెంకటేశ్వరా!


ఉల్లము నీకే ఇచ్చితిని
వూరక యుంచుట పాడిగాదురా
పిల్లన గ్రోవి చేసి విని
పిమ్పర మోహన రాగ సంపదల
చెల్లనికంఠ మిచ్చితివి
చెచ్చెర శంఖము చేసి యూదరా!
వల్లెగా తాల్చరాబ్రతుకు,
వైళమ గైకొని వెంకటేశ్వరా!


తడబడు గుండెలన్ బ్రతుకు
దారుల వంటరి గాడనైఎటో
నడుచుచు నుండు నావెనుక
నవ్వుచు నీవును వచ్చుచున్నటుల్
అడుగుల సవ్వడిన్ వినెద
నయ్యది నీవని పొంగి పోఎదన్
ఇదుములు అడ్డురావనుచు
నేగెద ముందుకు వెంకటేశ్వరా!


ఇసుక ఎడారిలో బడుచు
ఇంకెడు సన్నని వాగు రీతిగా
వెసఁ తోలి ప్రొద్దులన్ విరిసి
వెండియు సందెకు రాలు పూవుగా
మిసమిస లాడు యవ్వనము
మీగడ నవ్వులు వెన్నముద్దలున్
విసుగునడుల్లిపోవుగడ
వెంటగా నుండవ వెంకటేశ్వరా!


వేణువు నూదుచున్ హృదయ
వీధుల గ్రుమ్మరి నాడ వేప్పుడో
వీణియ మీటుచున్ హృదయ
వేదిక వాణిగా నిల్చి తెప్పుడో
త్రాణయె లేని నా బ్రతుకు
దారుల లచ్చిగా వచ్చి నిత్య క
ల్యాణము సేసి తొక్క ఎడ
అన్నిట నీవేర వెంకటేశ్వరా!


ప్రాణికి ప్రాణీకిన్ నడుమ
బాంధవ ముద్రలు పూల వంతెనలు
రాణ యొనర్ప జీవిత వి
రాగమే సాగిన దివ్య రాగముల్
వీణియ నందచేయగల
విశ్వ మనోహర దివ్య గాయకా
స్థాణువు నైన నా హృదయ
తంత్రులు మీటవా వెంకటేశ్వరా!


అంతం లేని సాగరపు
టావాలి యంచుల మిన్ను పంచలన్
వింత లవెన్ని యున్నవియో,విశ్వ
మదేంతటి శాంతి దామమో!
సుంత కనుంగోనన్ తలచి
చూపులు వాపిరి చెందు జీవితం
బంతము లేని సాగరము
ఆవల నీవేర వెంకటేశ్వరా!


మిన్నుల వెన్నెలల్ కురియు
మేలిమి మబ్బుల పూల మేడలో
కిన్నెర పాణి వీణియలు
కేల ధరించి గమించి మించుచున్
క్రొన్నన లెల్ల తీవలుగా
గొంతుల నెత్తుక పాట పాడుచున్ ,
నిన్నే భజింతు రంత,ఇక
నేనన నేంతర వెంకటేశ్వరా!
మసృణ మనోజ్ఞా రాగ విమ
లోజ్వల కోమల పాద పద్మమున్
మురిసిన తేనే టీగలుగా
ముక్తిని గాంతురు మౌనులేల్ల ,నీ
ప్రసరిత భావ సంపదల
పాడుచు వచ్చెడి తేటి నౌదు ,నా
కొసగవే రెక్కలన్ మురిసి
కొందుర నీ దరి వెంకటేశ్వరా!


నిద్దుర లోన నామనసు
నీకయి వచ్చును ,ఏదుకొన్డలన్
వొద్దిక తోడ నేక్కును ,న
మో !యని మ్రొక్కును కేక వెట్టి ,నీ
ముద్దుల రూపమున్ గనుచు
మూర్చిలి పోవును ,నన్నే నాముగా
దిద్దుకొనంగా రాదో!మరి
దేనికి మేల్కువ వెంకటేశ్వరా!


ఎన్నడో నమ్మి నానుకద
ఏలిక యుండెను ఏడు కొండలన్
మన్నన సేయు నన్ననచు ,
మట్టితో చేసిన మాయ బొమ్మ కే
మున్నది శక్తి?నీచరణ
ముల్ మది దాచక యున్న భక్తియే
యన్నము,ధ్యానమే వలువ
యంతియే చాలుర వెంకటేశ్వరా!


నీనని చెప్పు కొందు ,మరి
నీనాన నెవ్వరు?నిన్ను నిన్ను గా
నెనెద దాచుకొందు మరి
నీవన నెవ్వరు?నీవు,నేనునున్
దేనికి దూర మైతి మిటు?
తేజము నీవయి వట్టి నీడగా
నీనాయి పోవనేల?నను
నిన్నున జేర్చవ?వెంకటేశ్వరా!


తొగరు గులాబి రేకులవి
తూరుపు దిక్కున గుమ్మరించి తా
సొగసు వేలార్చేరా,యుషసి
సొంప్స్గు నీదగు కుంచె తాకినన్
అగణిత రాగ భావములు
యల్లిక లల్లుక పోవునయ్య !ఈ
పగిలిన బీద గుండెలకు
పట్టవా రంగులు వెంకటేశ్వరా!


నరులకు కావలెను సిరులు
నవ్విన,చూచిన ,పల్కరించినన్
గురుతుగా రూక చూపవలె ,
కోర్కెల గుత్తులు మెల్లమెల్లగా
విరియును లక్ష్మి చెంగ టనె !
వెర్రికి త్రాగుడు నేర్పినట్లుగా
సిరి మురిపించు నీ నరుల
చెప్పరా కొంచెము వెంకటేశ్వరా!


ఎన్నగారాని మోహముల ,
నెన్నిటినో ,వెసఁ సంతరించి ,ఆ
త్మోన్నతి నందు మారగమున
మోసపు త్రోవలు దిద్ది అచ్చమౌ
తెన్నుల దొంగ దీపములు
తేకువగా వెలయించు కొంటిరా!
కన్నుల చీకటిన్ తెగడు
కాటుక దిద్దర వెంకటేశ్వరా!


దివ్య స్వరూప!నీ హృదయ
తీర్ధము నందొక యాత్రికుందనై
భవ్య మనస్కతన్ వెలుగు
బాటల జేరగా గోరినాను ,నీ
నవ్య మనోజ్ఞా రూపమది
నాట్యములాడును నాడు కన్నులన్
కావ్యము నౌదు నేను ,కృతి
కర్తవు నీవేర వెంకటేశ్వరా!


సజ్జన వృత్తియన్ పువుల
చాలగ దూసుక వచ్చి యాత్మనే
సజ్జను చేసి యుంచితిని
సాగిలి వచ్చేడు భాష్ప ధారలన్
మజ్జనమాడ జేసితిని ,
మామక జీవన దివ్య వ్రుత్తికై
పజ్జను జేరి నిల్వు మని
పాదము కప్పితి వెంకటేశ్వరా!


బంగారు వంటి యౌవనము
పైకొని వచ్చు జరా భరమ్ముతొ
రంగులు మాయురా !ప్రణయ
రాజ్యము మెల్లన డుల్లి పోవురా !
పొంగిన గుండెలో విరియ
బూసిన పూవులు వాడి పోవురా!
చెంగట నీవు నిల్తువని
చేతులు జాతుర వెంకటేశ్వరా!


ఇహమన నెంతయో భ్రమసి
ఏ చరియించితి నెల్ల తావులన్
కుహు కుహు నాదముల్ పడుచు
కోయిల గొంతులు విందు నంచు
అహమది తెల్ల మైన యది
అంతయు శూన్యము, దైన్యమంతయున్
ఆహారహమున్ భవత్స్మరణ
కన్కిట మైతిని వెంకటేశ్వరా!


కొండను జేరవచ్చుతిని
గొప్పగా జూచితి నిన్ను, గుండెలో
పండెను భక్తీ భావములు ,
పాపపు చీకటి పారత్రోలుచున్
నిండెను వెల్గు నాఎడద ,
నిన్నట అల్లన పల్కరించితిన్ ,
కొండకు మెట్టు సేయుమని
కోరగా లేదొకో?వెంకటేశ్వరా!


నినుమది నిల్పి వేడుకొను
నిశ్చల చిత్తము సున్టలేక,నే
ననవరతంబు నా బ్రతుకు
నంగడి త్రిప్పుచు ,రూకలన్న చొ
కనులను పెద్ద చేసుకొని
కమ్మని కైతల ధారా పోయగా
చనెద నటంచు ,కోపమున
శాపము చుట్టితే ?వెంకటేశ్వరా!


ఒక నెలవంక తోచి విజ
యోత్సవ కాంతులు సంతరిమ్పగా
ఒక చిరుగాలి వీచి పువు
లోగిట పుప్పొడి జిమ్మి పోవగా
ఒక సెలయేరు పెల్లుబికి
ఒడ్డుల గజ్జెలు సందడిమ్పగా
ఒక కవితానుభూతి యెద
నొక్కులు దిద్దుర వెంకటేశ్వరా!


అంచిత భక్తీ భావముల
ఆత్మ వెలుంగులు దూసిపోయుచున్
వంచిన పూల కొమ్మ వలె
వారధిలా గావలె మానవాళి ,ఆ
పంచల పారు నీకరుణ
వాహిని చల్లగా నెల్లవేళ ,నీ
పెంచిన తోటరాకుసుమ
పీథము లెల్లెడ వెంకటేశ్వరా!


దేహము నిచ్చి నావుగద
తీరని దాస్యము చేయజాలరా!
గేహము నిచ్చి నావుగద ,
కిన్నెర లాస్యము చేయజాలరా!
మోహము కప్పినావుకద,
మోసపు దుప్పటి మొయలేనురా!
వాహన మౌడురా ఎగిరి
వ్రాలర రెక్కల వెంకటేశ్వరా!


విచ్చిన నంది వర్ధనము
వెన్నెలలో తలలూపినట్లు ,భా
వోచ్చాయ వీధులను కవిత
లుయ్యలలూగిన యట్లు ,పల్లెలను
పచ్చని పంట సీమపయి
బంగారు పిచ్చుక లాడినట్లు ,నీ
నెచ్చెలి వచ్చి పోవునురా!
నిలవదు మాదరి వెంకటేశ్వరా!


అరువది వత్సరమ్ము లిటు
లల్లన సాగెను జీవితమ్ములో
సిరిని వరించి తెచ్చి మరి
చేర్చగా లేదురా బందిఖానలో
సరసుడా వంచు నిన్నేరిగి
చక్కగా దాచితి నాడు గుండెలో
మురియుచు పిల్చుకొందునురా
ముద్దుగా బల్కవ వెంకటేశ్వరా!


జీవిత మంతయున్ మురిసి
సేవలు చేసితి నీకు,నిచ్చలున్
పావన మైన నీ స్మరణ
భాగ్యము కల్గెను ,రాతి పూవులో
తావులు గ్రుమ్మరించితివి
దాచక పంచితి నెల్ల వారికిన్
రావలె నీవు దగ్గరకు
రాజిలు శోభలు వెంకటేశ్వరా!



ఏటికో ఎవ్వరిన్ గనిన
ఎప్పటి బంధువులో వరమ్ముగా
నేటికి జూచి నాడనని
నెమ్మది పొంగేద మేలమాడేదన్
చాటెద భక్తీ భావములు
చక్కగా పాడెద ,గుండె వాకిటన్
పీటలు వేసి పిల్చెదను
పెంపోనరించెద వెంకటేశ్వరా !


తెల తెల వార తూర్పుమల
దిద్దిన చల్లని లేత వేల్గులో
కల కల లాడు పుష్పములు
కమ్మని జాబులు తెచ్చి ఇచ్చురా!
పిలిచితి వేమొ నీవనుచు
పిట్టల సందడి నాలకిన్తురా!
ఇల పయి పైడి నిచ్చెనలు
ఈ తోలి ప్రొద్దులు వెంకటేశ్వరా!


గడచిన కాల వాహినుల
కట్టడి కొయ్యల నావ నెట్టులో
నడిపితి విన్నినాళ్ళు మరి
నావకు లోతగు నీరు నీవెరా!
సుడులను తాకకుండా ,యెది
చుట్టక ముట్టక తీర సీమకున్
వడి వడి చేర్పరా చరణ
సన్నిధి చేర్చర వెంకటేశ్వరా!


ఒవరదాయకా!బ్రతుకు
నూర్పిడి సేతువు కర్మ లేడ్లుగా
ప్రోవులు పడ్డ పాపమది
పొందగు కుప్పగా ,నీదు ధ్యానమే
కావలె నిత్తరిన్ పసిడి
కల్లముగా ,నది శూన్య మైనచో
జీవితమంతా తప్పలుర
చేటల చేటురా వెంకటేశ్వరా!


అల్లన తొంగి చూచి హృద
యాంతర మందొక పైడి గూడుగా
నల్లి తనన్తటన్ చిలిపి
నాణెపు వీణియ మీటి పాడి ,ఎ
చెల్లని వాని నైనను వి
జేతగా సేయుచునుండు లక్ష్మి మే
మెల్లను తండ్రి బిడ్డలము
మేలయే నయ్యది వెంకటేశ్వరా !



తలచిన యంతనె బ్రతుకు
దారుల పూవుల మేడ గట్టుచును
కొలచిన యంతనె వెలుగు
కొండగా చెంతకు వచ్చి
నిలచుచున్
పిలిచినా యంతనె మురిసి
పెంచిన తండ్రిగా చేయి జాచుచున్
కలతలు తీర్చు దేవుడవు
కన్నుల దాతురా వెంకటేశ్వరా!



నాటక రంగ మీ జగము ,
నాటక వృత్తము నీదు హేలయే
మాటలు ,పాటలున్ ఎవరి
మార్గము వారిది,ధర్మ మార్గమున్
దాటగా రాదు ,మోహమను
దారిన బోవగ రాదటంచు ఏ
చ్చోతనో దాగి పల్కెదవు
చూడరా నా కధ వెంకటేశ్వరా!


కరువటారా ప్రభూ కరుణ !
కర్మలు త్రెంచుట కొత్త విద్యయా!
బరువటారా ప్రభూ పదము
పట్టిన భక్తుల కాచి బ్రోచుటల్
అరుదటారా ప్రభూ అభయ
హస్తము నల్లన జాచి పిల్చుటల్
పరమ పదమ్ము జేర్పగల
భారము నీదేరా వెంకటేశ్వరా!


పంకజ నాభ నా హృదయ
పద్మము నందలి వెల్గు రేకలే
యుంకువ లౌను నీకనచు
ఉత్సుకతాన్ కోన గోట గిల్లి నీ
కంకిత మిచ్చినాను ,పృధు
కావ్యము కాదిది ,పూల జాబురా
వంకలు పెట్ట బొకుమురా
వంశి మనోహర వెంకటేశ్వరా!


గోవింద యని పిలవ కో యందు వట నీవు
వాస్తల్య రాశివా వరదరాజ
ఏడు కొండల వాడ ఎక్కడ నీవన్న
ఎక్కి రమ్మందువా చక్కనయ్య
వడ్డీ కాసులవాడ వచ్చు చున్నా నన్న
తొంగి చూచెద వెంత దొడ్డ దొరవో
ఆపద మ్రొక్కుల అయ్యవాయన్న
కాపాడే దేంతటి కరుణయయ్య
నిన్ను తలచిన వారికి నిజాము సుమ్ము
కాపురము వీడి పరుగెత్తు పాపమేల్ల
నిన్ను కొలచిన వారికి నిజాము సుమ్ము
భవ భయమ్ములు దూరమై పారిపోవు

నీదు నామంబు మనసున నిలుపుకొందు
నాడు ముప్పులు తప్పించి నడుపుమయ్య
నీదు నామంబు మోమున నిలుపుకొందు
నాడు తప్పులు సైరించి నడుపుమయ్యా !


ఒకరన్నారు -
చ -తిరుపతి వేంకటేశ్వరుని దివ్య గుణంబులు తీర్చి దిద్దగా
సరస పదాళి గుంభనము సన్నుత మైన అలంక్రియోద్ధతిన్
విరసిత పద్మ గంధ సమ విస్తృత హావములోప్పు భావముల్
యరసి రచించి నావుగద హాయిగా వెంకట సత్య ధీ మణీ

నేమాని గోపాల కృష్ణ మూర్తి శాస్త్రి





















0 comments:

Post a Comment